జుక్కల్ నియోజకవర్గం

15 ఏళ్లలో ఒక్క ఇళ్లూ ఇవ్వని అసమర్థుడు హన్మంత్ షిండే

✍️ V59 News03.09.2026 · 6:59 pm👁️ 33 వ్యూస్

మహమ్మద్‌నగర్ మండలంలో గత పదిహేనేళ్లలో బుడగ జంగాల అభ్యున్నతికి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఏనాడు కృషి చేయలేదని, ఏ ఒక్కరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించలేదని ఆయనొక అసమర్థ నాయకుడని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తీవ్రంగా మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రకరకాల రాజకీయ కుట్రలకు, కుతంత్రాలకు, రాజకీయ స్వార్థానికి మాత్రమే ప్రాధాన్యం ఉండేదని ఆయన ధ్వజమెత్తారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో, కనీస ఇళ్లు లేక గుడిసెలు, టెంట్లు, ఫ్లెక్సీలు, రేకుల షెడ్ల కింద జీవిస్తున్న బుడగజంగాల బతుకులను గత పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు ఇచ్చి తీరుతామని వాగ్దానం చేశామని, అందులో భాగంగానే మొదటి విడతలో 8 మందికి ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేసి కాంట్రాక్టర్ ద్వారా పనులు వేగవంతం చేశామని ఎమ్మెల్యే తెలిపారు.

మహమ్మద్‌నగర్ మండలంలో అర్హత ఉన్న ప్రతి బుడగజంగాల కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు బాధ్యత తమదేనని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ల పార్టీ అని, పార్టీ లేని వాళ్లను కూడా ఆదరిస్తుందని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనమని లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు.