ఎల్లారెడ్డి నియోజకవర్గం

హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

✍️ Journalist Kummari Srinivas02.09.2026 · 5:15 pm👁️ 12 వ్యూస్

ఎల్లారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ నాయకత్వం వహించారు. ‘వద్దురా నాయన కాంగ్రెస్ పాలన’ అంటూ గులాబీ శ్రేణులు నినాదాలు హోరెత్తించాయి. ఈ సందర్భంగా ‘420 హామీలు – 420 ఫిట్లు’ అనే ఫ్లెక్సీతో పాటు కాంగ్రెస్ బాకీ కార్డుతో ప్రజల్లోకి వెళ్లి నిరసన తెలిపారు.

ఆరు గ్యారెంటీలు పచ్చి మోసం: జాజాల సురేందర్

ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి, నేటికి వెయ్యి రోజులు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. “వచ్చే నెల.. మరో 100 రోజులు” అంటూ కాలయాపన చేస్తూ ప్రజలను మోసగించారని ఆరోపించారు.

విస్మరించిన హామీలు: మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, రైతులకు రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, పెంచిన పింఛన్లు, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలన్నింటినీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు.

బాకీల చెల్లింపునకు డిమాండ్: ప్రజలకు ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రతి రూపాయి బాకీని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రాజీలేని పోరాటం: రైతులు, మహిళలు, యువతను నిరాశపరిచిన కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో యువకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.