జుక్కల్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదు కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు సైనికుల్లా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటు గల్లంతు కాకుండా బూత్ స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం రాజు, జహీరాబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అరుణతార కోరారు.
మద్గూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్‌లో బుధవారం సాయంత్రం ఎస్‌ఐఆర్ ఓటర్ల నమోదు ప్రక్రియపై బీజేపీ జుక్కల్ నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో ప్రతి ఓటు వివరాలను పరిశీలించి, అర్హులైన వారందరి పేర్లు నమోదు అయ్యేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రాము,ఆనంద్ కుమార్ జాదవ్, వివిధ మండలాల అధ్యక్షులు, బూత్ లెవెల్ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. మద్గూర్ మండల అధ్యక్షులు తెప్ప తుకారం, డోంగ్లి మండల అధ్యక్షులు అరుణ్ పటేల్, బిచ్కుంద మండల అధ్యక్షులు విష్ణు, రాథోడ్ సునీత తదితరులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేశారు.






