కామారెడ్డి

కామారెడ్డి మున్సిపాలిటీలో రూ.1.70 కోట్ల అవినీతి? కలెక్టర్‌కు బీజేపీ కౌన్సిలర్ల ఫిర్యాదు

✍️ V59 News01.08.2026 · 11:16 pm👁️ 8 వ్యూస్

V59 NEWS – కామారెడ్డి:
కామారెడ్డి పురపాలక సంఘంలో నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నిధుల వినియోగంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వివిధ అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల్లో దాదాపు రూ. 1.70 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, శనివారం జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.
రూ. 1.70 కోట్ల అనుమానాస్పద చెల్లింపులు:
కలెక్టర్‌కు సమర్పించిన ఫిర్యాదులో బీజేపీ ప్రతినిధులు కీలక గణాంకాలను బయటపెట్టారు:
జనరల్ ఫండ్స్ నిధులు: మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా మొత్తం రూ. 5,92,91,364 ఖర్చు కాగా.. అందులో 75 బిల్లులకు సంబంధించి రూ. 1,13,14,566 చెల్లింపుల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపించాయి.
SDRF నిధులు: విపత్తు నిర్వహణ (SDRF) కింద రూ. 71,28,937 ఖర్చు చేయగా, కేవలం 5 బిల్లులకే ఏకంగా రూ. 59,86,353 కేటాయించి చేతివాటం చూపిం‌చారని ఆరోపించారు.
“ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అధికారులతో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులు కలిసి ఈ అవినీతికి పాల్పడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.”
— బీజేపీ కౌన్సిలర్లు, కామారెడ్డి
విజిలెన్స్ విచారణకు హెచ్చరిక:
జిల్లా కలెక్టర్ స్పందించి నిష్పాక్షిక విచారణ జరిపించకపోతే, ఈ కుంభకోణంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (Vigilance & Enforcement Director) కు ఫిర్యాదు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.