డోంగ్లీ, నేటి ప్రతినిధి: ఓట్లు అడిగే సమయంలో గ్రామానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, ఎన్నికలు ముగిసిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఎంబూర గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంబూర–జారా లింబూర్ ప్రధాన రహదారి గుంతలతో పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని గ్రామస్థులు తెలిపారు. వర్షాలు కురిసిన ప్రతిసారి రహదారిపై నీరు నిలిచి చెరువును తలపిస్తోందని, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించడం కూడా కష్టసాధ్యంగా మారిందని, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
“ఎమ్మెల్యే గారూ… మా ఊరిని పట్టించుకుని వెంటనే రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోండి. మా ప్రాణాలకు విలువ ఇవ్వండి” అని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఎంబూర–జారా లింబూర్ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.



