Cenima

కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లతోనే బహుజనులకు అన్యాయం

✍️ V59 News19.07.2026 · 10:08 pm👁️ 12 వ్యూస్

బాన్సువాడ, జూలై 19: కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు బహుజనుల పట్ల శత్రుత్వంతో వ్యవహరిస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీలను ఓడించాలని బీఎస్పీ చీఫ్‌ జోన్‌ ఇన్‌ఛార్జ్‌ అడ్వకేట్‌ నిషాని రామచంద్రం పిలుపునిచ్చారు. ఆదివారం బాన్సువాడలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన జహీరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడటానికి ఆ పార్టీలే కారణమన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగ రక్షణ కోసం మాయావతి నాయకత్వంలో బహుజన రాజ్యం స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ నెల 26న కామారెడ్డిలో నిర్వహించనున్న ఛత్రపతి సాహూజీ మహారాజ్ రిజర్వేషన్ల దినోత్సవ సభకు యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో బీఎస్పీ నాయకులు గైని గంగాధర్, ఉబ్బిత్వార్ రోహిదాస్, మాలోత్ హరిలాల్ నాయక్, గొల్ల సతీష్, సిహెచ్. అశోక్ తదితరులు పాల్గొన్నారు.