బాన్సువాడ నియోజకవర్గం

నిజాంసాగర్ జలకళ.. వానాకాలం పంటలకు సాగునీటి విడుదల

✍️ Kummari Shankar03.09.2026 · 1:40 pm👁️ 8 వ్యూస్

రాష్ట్రంలో వానాకాలం పంటలకు సాగునీటిని అందిస్తున్న తొలి ప్రాజెక్టుగా నిజాంసాగర్ చరిత్రకెక్కింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా బుధవారం వానాకాలం పంటల సాగు కోసం అధికారికంగా నీటిని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు ముఖ్య అతిథులుగా హాజరై నీటిని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ శ్రీ రవీందర్ రెడ్డి, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రెండు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు.

నీటి నిల్వలు పెరిగాయి: పోచారం శ్రీనివాస రెడ్డి

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సుమారు 36 శాతం వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. అయినప్పటికీ, నిజాంసాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులోకి నీరు చేరిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టులో 13.3 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రవ్యాప్త ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారని.. ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు అందుబాటులోని నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారని తెలిపారు. చీఫ్ ఇంజనీర్ల కమిటీ సిఫారసుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

పొదుపుగా వాడాలి.. చివరి ఆయకట్టుకూ నీరందాలి

నిజాంసాగర్ కింద సుమారు 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, పంటలను కాపాడేందుకు నీటిని ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పోచారం వెల్లడించారు.