క్రీడలు

రైతుల కోరిక మేరకు ఖరీఫ్ పంటకు నిజాంసాగర్ నీళ్లు

✍️ Kummari Shankar20.08.2026 · 7:12 pm👁️ 4 వ్యూస్
  1. నిజాంసాగర్, ఆగస్టు 20: రైతుల విజ్ఞప్తి మేరకు ఖరీఫ్ పంట సాగుకు అవసరమైన సాగునీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

 

గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్టులోని నీటి నిల్వ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1400.84 అడుగుల నీటిమట్టంతో 12.284 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ప్రాజెక్టు డీఈ శ్రీ ప్రవీణ్ తెలిపారు.

 

నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే వరి నాట్లు వేసుకున్న రైతులకు ఇబ్బందులు కలగకుండా ఖరీఫ్ పంటకు అవసరమైన నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పోచారం వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

 

అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పంటలను కాపాడుకోవాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలోని నాన్-కమాండింగ్ ఏరియాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ రివైజ్డ్ శాంక్షన్‌కు అంగీకారం తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి రైతుల తరఫున పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో బాన్సువాడ, నిజాంసాగర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.