కామారెడ్డి

ఫీజు బకాయిలపై బీజేపీ లడాయి బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా

✍️ Kummari Shankar21.08.2026 · 4:47 pm👁️ 7 వ్యూస్

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. “ఫీజు బకాయి.. బీజేపీ లడాయి” నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ ధర్నా చేపట్టి ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేసి వారికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. బకాయిల విడుదలలో ఇంకా జాప్యం చేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజు, నాయకులు పైడిమల్ లక్ష్మినారాయణ, శ్రీనివాసరెడ్డి, కొనాల గంగారెడ్డి, శంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేశారు.