ఎల్లారెడ్డి, జూలై 31: ఎల్లారెడ్డి మండలంలో జలసిరి పథకం కింద మంజూరైన పనుల పురోగతి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామపంచాయతీల సొంత ఆదాయ వనరుల (ఓఎస్‌ఆర్) పెంపుపై మండల స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జలసిరి పథకం కింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు. అలాగే గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లను మెరుగుపరచడం, సొంత ఆదాయ వనరులను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సవివరంగా చర్చించారు.
అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి 45 రోజులకు ఒకసారి మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో ఎల్లారెడ్డి మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్ (ఎంఆర్‌వో), ఎంపీడీవో, మండలంలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.



