కామారెడ్డి

కాటేపల్లిలో పేదలకు కొండంత అండ: రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ LOC అందజేత

✍️ V59 News27.07.2026 · 12:52 pm👁️ 3 వ్యూస్

పెద్ద కొడప్‌గల్, జూలై 27:
బాధితులకు కొండంత అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పేద ప్రజల వైద్య ఖర్చులకు ఎంతో దోహదపడుతోందని పెద్ద కొడప్‌గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్యామప్ప పటేల్ అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు ఆదివారం కాటేపల్లి గ్రామాన్ని సందర్శించిన ఆయన, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ (ఎల్‌ఓసీ) లేఖను లబ్ధిదారురాలైన బోధనం విట్టవ్వ కుమారుడు, మాజీ సర్పంచ్ బోధనం విఠల్‌కు స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా శ్యామప్ప పటేల్ మాట్లాడుతూ… తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బోధనం విట్టవ్వ పరిస్థితిని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకెళ్లగానే, ఆయన వెంటనే స్పందించి ప్రత్యేక చొరవతో ఈ సహాయాన్ని మంజూరు చేయించారని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆపద సమయంలో రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నందుకు సీఎం సహా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు, ఇందుకు సహకరించిన కాంగ్రెస్ నాయకులకు లబ్ధిదారు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు మల్లప్ప పటేల్, మొహిద్దిన్ పటేల్, మొగులా గౌడ్, గంగా గౌడ్, పెంటన్న, చాంద్ పాషా, చౌటకురి శంకర్, హన్మండ్లు, రాంచందర్, హాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.