బీర్కూర్, జూలై 31: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో మూడు నివాస గృహాలు పూర్తిగా కూలిపోయాయి. ఈ ఘటనలో కొట్టె సత్యవ్వ, వడ్ల శ్రీనివాస్, వడ్ల హన్మాండ్లు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి.
ఇళ్లు కూలిపోవడంతో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, ధాన్యం, నిత్యావసర వస్తువులు వర్షపు నీటిలో తడిసి పనికిరాకుండా పోయాయి. ఒక్కసారిగా నివాసం కోల్పోయిన బాధిత కుటుంబాలు ప్రస్తుతం బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందుతున్నాయి. జరిగిన నష్టంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటన విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ అట్టారి కృష్ణ, మాజీ సర్పంచ్ పుల్లేల బాబురావు, వార్డు సభ్యురాలు అరుణ రాజు, బొంబాయి రాము, కానూరి హన్మాండ్లు తదితర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ఘటన స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు వెంటనే గ్రామానికి చేరుకుని నష్టం అంచనా వేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితులకు పరిహారం, తక్షణ ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు. అలాగే ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బలహీనంగా మారిన పాత ఇళ్లకు ప్రమాదం పొంచి ఉన్నందున గ్రామంలో ప్రత్యేక సర్వే నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.



