ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం నెమలీ గ్రామానికి చెందిన పందిరి అంజవ్వ, తీర్లపురం సాయిలు అనారోగ్య పరిస్థితులతో ఇబ్బందిపడుతూ సాయం కోరగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ మేరకు వారు క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో చెక్కులను అందుకున్నారు.
ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి, నిరంతరం అందుబాటులో ఉంటూ సేవనందిస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యేకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు చందూరి హన్మండ్లు, సర్పంచ్ సింగిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నాయకులు చందూర్ సాయిలు, బండి లక్ష్మణ్, కోర్వ నవీన్, కార్యాలయ సిబ్బంది సతీష్ తదితరులు పాల్గొన్నారు.




