జుక్కల్, జూలై 19: జుక్కల్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న తనను పదవి నుంచి తొలగించారంటూ సోషల్ మీడియాలో, కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, అటువంటి తప్పుడు వార్తలను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని నియోజకవర్గ ఇన్‌చార్జి జాదవ్ ఈశ్వర్ స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల వెలువడిన ఆ వార్తలపై పార్టీ హైకమాండ్ ఆరా తీసి, తనను పిలిపించి పూర్తి వివరాలు సేకరించిందని తెలిపారు. అసత్య ప్రచారాలకు ఎవరు కారణమనే దానిపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. పార్టీలో ఒకరిని సస్పెండ్ చేయడం లేదా పదవుల నుంచి తొలగించడం అనేది వ్యక్తిగత నిర్ణయం కాదని, ఆ అధికారం కేవలం పార్టీ క్రమశిక్షణ కమిటీకే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
నాయకత్వంతో చర్చలు
పార్టీ వ్యవస్థాపకులు మల్లన్న గారి ఆదేశాల మేరకు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నర్సా గౌడ్ గారిని కలిసి నియోజకవర్గంలోని తాజా పరిణామాలను వివరించినట్లు ఈశ్వర్ తెలిపారు. జరిగిన అంశాలను వారు పరిశీలించారని, తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్దని సూచించారని చెప్పారు. త్వరలోనే జుక్కల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశంలో కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకుండా, పార్టీ అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కార్యకర్తలను ఆయన కోరారు.



