జుక్కల్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రెండు పార్టీల నుంచి పలువురు కీలక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు.
మాజీ ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు సమక్షంలో ఈ భారీ చేరికలు చోటుచేసుకున్నాయి. పార్టీలో చేరిన నాయకులకు వారు కాషాయ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులమై బీజేపీలో చేరుతున్నట్లు పలువురు నేతలు వెల్లడించారు. ఒకేసారి రెండు ప్రధాన పార్టీల నుంచి కీలక నాయకులు కాషాయ గూటికి చేరడంతో జుక్కల్ నియోజకవర్గంలో కమలం పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొనగా, కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేగింది.
ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ జాదవ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేవన్ మరియు ఆయా మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో చేరిన వారు వీరే..
- కాంగ్రెస్ పార్టీ నుంచి: గణేష్ పట్తాలి, సుత్నార్ వెంకట్, సుత్నార్ సేందే, లక్ష్మ (మహ్మదాబాద్ ఉప సర్పంచ్), సంజు, గోల విట్టల్, ఎంబడి పండరి, రాథోడ్ శ్రీనాథ్, రాథోడ్ చింటూ, జాదవ్ కాశీనాథ్, పోవార్ సునీల్.
- బిఆర్ఎస్ పార్టీ నుంచి: అనిల్ రాథోడ్, చిన్నవార్ నాగనాథ్, సచిన్.
- వీరితో పాటు రెండు పార్టీల నుంచి మరో 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.




