జుక్కల్, V59 News : మండలం పరిధిలోని బస్వాపూర్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గొర్రెల షెడ్డుపై కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో మూడు గొర్రెలు మృతి చెందగా, మరో ఐదు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.
బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన గొర్రెల పెంపకందారుడు వాగమారే హన్మంత్ రాత్రి సమయంలో తన గొర్రెలను షెడ్డులో భద్రపరిచాడు. కాగా, రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో కుక్కల గుంపు ఒక్కసారిగా షెడ్డులోకి చొరబడి జీవాలపై దాడికి తెగబడ్డాయి. గొర్రెల అరుపులు వినిపించడంతో హన్మంత్ పరుగున వచ్చి చూసేసరికే మూడు గొర్రెలు కొరికి చంపబడ్డాయి. తీవ్రంగా గాయపడిన మరో ఐదు గొర్రెల పరిస్థితి విషమంగా ఉంది.
చేతికొచ్చిన జీవాలు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తనకు భారీగా నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. జీవాల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్న తన కుటుంబం ఈ నష్టంతో రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. గాయపడిన గొర్రెలకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు, చనిపోయిన జీవాలకు తగిన నష్టపరిహారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని హన్మంత్ వేడుకుంటున్నాడు.



