కామారెడ్డి

బైరాపూర్ రుక్మిణి విఠలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

✍️ Kummari Shankar27.07.2026 · 1:11 pm👁️ 3 వ్యూస్

బైరాపూర్ రుక్మిణి విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు – భక్తులకు విస్తృత ఏర్పాట్లు

 

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రెండవ పండరిపూర్‌గా ప్రసిద్ధి చెందిన బైరాపూర్ గ్రామంలోని శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.

తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాల పంపిణీతో పాటు తాగునీరు, విశ్రాంతి, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను సమకూర్చారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తొలి ఏకాదశి వేడుకల సందర్భంగా వచ్చిన భక్తులకు బస సౌకర్యం కల్పించామని తెలిపారు. ఆలయంలో భజన, కీర్తన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆదివారం ఒక్కపొద్దు ఉపవాస దీక్షలు ముగించుకునే భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.